తుపాను నేపథ్యంలో ప్రాజెక్టులు, జలాశయాలపై చంద్రబాబు సమీక్ష
బంగాళాఖాతంలో తుపాను ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జలవనరులను సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
Chandrababu


అమరావతి , 25 అక్టోబర్ (హి.స.)బంగాళాఖాతంలో తుపాను ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జలవనరులను సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. భారీ వర్షాలు సంభవించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని వరద నిర్వహణ, నీటి నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన జలవనరుల శాఖ సమీక్షలో పలు ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. వర్షపు నీటిని వృథా కాకుండా జలాశయాలు, చెరువుల్లో నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒకవైపు భారీ వర్షాల వల్ల వరద ముప్పు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, మరోవైపు భవిష్యత్తులో సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా నీటిని నిల్వ చేయడం ప్రభుత్వానికి ముఖ్యమైన అంశంగా మారింది.

చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను నవంబర్ నుంచి తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రాధాన్యంగా గుర్తించిన 36 ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం పూర్తి చేసి, 2028 డిసెంబర్ నాటికి వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంపైనా దృష్టి సారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande