
అమరావతి , 26 అక్టోబర్ (హి.స.)
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి 'అర్ణబ్' తుపానుగా రూపాంతరం చెందింది. ఈ తుపాను తీవ్ర రూపం దాల్చి అక్టోబర్ 28 నాటికి బాపట్ల మరియు విశాఖపట్నం (యానాం సమీపంలో) మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా హెచ్చరించింది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గాలివాన తీవ్రత పెరిగితే గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది.
రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) బృందాలను ఇప్పటికే సమస్యాత్మక తీర ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్