
న్యూఢిల్లీ:, 26 అక్టోబర్ (హి.స.)
ఫిలిప్పీన్స్‌లోని సెబూ వేదికగా అక్టోబర్ 28 నుంచి 29 వరకు జరగనున్న 13వ ‘అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్’ (ఆసియాన్) రక్షణ మంత్రుల సమావేశం (ADMM-Plus)లో భారత ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వం వహించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాలపై ప్రసంగించనున్నారు.
సమావేశం సందర్భంగా వివిధ సభ్య దేశాల రక్షణ మంత్రులతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆసియాన్ దేశాలతో కొనసాగుతున్న రక్షణ సంబంధాలను సమీక్షించడంతో పాటు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను అన్వేషిస్తారు. సభ్య దేశాల మధ్య భద్రతా, రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి ఈ వేదిక కీలక ప్రతిపత్తిగా పనిచేస్తుంది.
ఆసియాన్ రక్షణ వేదిక - ప్రాముఖ్యత
దక్షిణాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) మరియు దాని 8 సంభాషణ భాగస్వామ్య దేశాల కలయికతో ఏర్పడిన అత్యంత ప్రాధాన్యత కలిగిన రక్షణ వేదిక ఇది. 2010లో స్థాపించిన ఈ వేదికలో 10 ఆసియాన్ సభ్య దేశాలైన బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావో పిడిఆర్, మలేషియా, మైన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, తైమూర్ లెస్టే, వియత్నాంలతో పాటు 8 ‘ప్లస్’ దేశాలైన భారత్, చైనా, రష్యా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు భాగస్వాములుగా ఉన్నాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, రక్షణ-భద్రతా వ్యవహారాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడం ఈ వేదిక ప్రధాన లక్ష్యం. ఉగ్రవాద నిర్మూలన, సముద్ర భద్రత, ప్రకృతి విపత్తుల నిర్వహణ, శాంతి పరిరక్షణ చర్యలు, మిలిటరీ మెడిసిన్, మానవతా దృక్పథంతో చేపట్టే మైన్ల తొలగింపు చర్యలు, సైబర్ భద్రత వంటి కీలక అంశాలు ఈ వేదిక పనిపరిధిలోకి వస్తాయి.
'యాక్ట్ ఈస్ట్ పాలసీ'కి ఊతం
భారత్ 1992లో ఆసియాన్ డైలాగ్ భాగస్వామిగా మారింది. తొలి ఎడీఎమ్ఎమ్-ప్లస్ సదస్సు 2010 అక్టోబర్ 12న వియత్నాంలోని హనోయ్‌లో జరిగింది. ఆసియాన్, ప్లస్ దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పటిష్టం చేసేందుకు 2017 నుంచి ఈ రక్షణ మంత్రుల సమావేశాలు ప్రతి ఏటా క్రమం తప్పకుండా జరుగుతున్నాయి.
2026 సంవత్సరానికి గాను ఈ ఎడీఎమ్ఎమ్-ప్లస్ సదస్సుకు ఫిలిప్పీన్స్ అధ్యక్షత వహిస్తోంది. కాగా, ఈ వేదిక పరిధిలో 2024-2027 కాలానికి గాను ఉగ్రవాద నిరోధక నిపుణుల కార్యనిర్వాహక బృందానికి మలేషియాతో కలిసి భారత్ సహ-అధ్యక్షత వహిస్తోంది. ఎడీఎమ్ఎమ్-ప్లస్ వ్యవస్థలో భారత్ చురుగ్గా పాలుపంచుకోవడం 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'కి అనుగుణంగా ఆగ్నేయాసియాలో రక్షణ దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi