ఖర్గే నివాసం ముట్టడికి ఢిల్లీ బీజేపీ యత్నం: ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఖర్గే నివాసం ముట్టడికి ఢిల్లీ బీజేపీ యత్నం: ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఖర్గే నివాసం ముట్టడికి ఢిల్లీ బీజేపీ యత్నం: ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్


న్యూఢిల్లీ, 26 అక్టోబర్ (హి.స.)

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఖర్గే నివాసం ముట్టడికి యత్నించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రాజ్‌మార్గ్‌లోని ఖర్గే నివాసానికి వెళ్లేందుకు సేనా భవన్ సర్కిల్ వద్ద నిరసనకారులు ప్రదర్శన చేపట్టగా, భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు.

ప్రధాని మోదీని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాలని పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు.

పాట్నా సభలో వివాదం - ఖర్గే వ్యాఖ్యలే కారణం

పాట్నాలో జరిగిన బీహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ 139వ జయంతి వేడుకల్లో మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తున్న సమయంలో ఈ వివాదం చెలరేగింది. ప్రసంగం మధ్యలో సభికుల్లో ఒకరు మోదీ ఎప్పటికీ ఎక్కడికీ వెళ్లరు అని అనగా, దానికి స్పందించిన ఖర్గే మోదీ కా బాప్ భీ జాయేగా (మోదీ తండ్రి కూడా పోవాల్సిందే) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కార హీనమైన భాషను ఉపయోగిస్తూ కాంగ్రెస్ నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నిరసనకారులు ప్రదర్శన సందర్భంగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande