
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేతగా ఉన్న ఖర్గే.. ప్రధానిపై ఈ స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేయడం విచారకరమని పేర్కొన్నారు.
నగరంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.
ఖర్గే ప్రసంగించిన సభకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదని రామచందర్ రావు వ్యాఖ్యానించారు. వేదికపై ఉన్న నాయకుల సంఖ్యతో పోలిస్తే సభకు హాజరైన ప్రజలు తక్కువగా ఉన్నారని ఎద్దేవా చేశారు. గత 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసహనానికి, నిరాశకు గురవుతోందని విమర్శించారు.
ఆ రాజకీయ అసంతృప్తి కారణంగానే ఖర్గే తన వ్యాఖ్యల్లో సంయమనం కోల్పోయారని రామచందర్ రావు ఆరోపించారు. ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో ఆయన తండ్రిని సైతం ప్రస్తావిస్తూ మాట్లాడటం రాజకీయంగా దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. సీనియర్ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని ఆయన హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..