
అమరావతి , 26 అక్టోబర్ (హి.స.)
అర్నబ్ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ సమీక్ష నిర్వహించి, తుపాను సన్నద్ధతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పరిస్థితిని చర్చించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం స్పష్టం చేసింది.
తుపాను తీరం దాటిన అనంతరం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ వర్షాల ప్రభావం ఉండొచ్చని తెలిపారు. తీర ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, వైమానిక దళం, కోస్ట్‌గార్డ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ నెల 29వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి తీరానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా విద్యుత్ సరఫరా, సమాచార వ్యవస్థలకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్