
జగిత్యాల , 26 అక్టోబర్ (హి.స.)
ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతాయుతంగా తీసుకోవాలని, సంబంధిత సమస్యపై సమగ్ర విచారణ జరిపి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని తెలిపారు. ప్రతి దరఖాస్తును ప్రాధాన్యంతో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో పాటు దరఖాస్తుదారులకు తగిన సమాచారం అందించాలని తెలిపారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..