విశాఖను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తాం: నారా లోకేశ్
విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Lokesh


విశాఖ , 26 అక్టోబర్ (హి.స.)

విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రకృతి సౌందర్యం, ఆధునిక సాంకేతికత కలగలిసిన విశాఖకు ప్రపంచ నగరాల సరసన నిలిచే సామర్థ్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సముద్ర తీరం, పచ్చని కొండలు, రాతి కొండచరియలు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

విశాఖను తూర్పు తీరంలోని శాన్ఫ్రాన్సిస్కో తరహా నగరంగా అభివృద్ధి చేయాలన్నది తమ ఆలోచనగా లోకేశ్ వెల్లడించారు. ప్రకృతి వనరులను కాపాడుకుంటూనే సాంకేతికత, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, నగరంలోని సహజ అందాలను అంతర్జాతీయ పర్యాటకులకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

విశాఖలో టెక్నాలజీ రంగం క్రమంగా విస్తరిస్తుండటం నగర భవిష్యత్తుకు సానుకూల పరిణామమని మంత్రి తెలిపారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగేలా నగరాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. గంగవరం బీచ్ అందాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రాకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖ ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తే విశాఖ మరింత ఆకర్షణీయమైన నగరంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande