
ఖమ్మం, 26 అక్టోబర్ (హి.స.)
చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వెచ్చించి, బౌద్ధులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా అన్ని చర్యలు చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
సోమవారం నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూప అభివృద్ధి, పర్యాటక సదుపాయాల కల్పన, చారిత్రక కట్టడాల సంరక్షణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాల్లో నేలకొండపల్లి స్తూపం ఒకటని పేర్కొన్నారు. గతంలో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో అనేక పురాతన వస్తువులు లభించాయని, వాటిని ప్రస్తుతం హైదరాబాద్ మ్యూజియంలో భద్రపరిచారని తెలిపారు.
బౌద్ధ మతస్థులు, స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. నేలకొండపల్లిలోని మూడో శతాబ్దానికి చెందిన చారిత్రక బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం తీసుకొచ్చి, తీర్చిదిద్దుతామని పొంగులేటి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు