
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)
భూములు తమ సొంతమైనప్పటికీ అవి నిషేధిత జాబితాలో ఉండటంతో రైతులు రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ముథోల్ మండలంలోని రాంటెక్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ అధికారుల తప్పిదాల కారణంగా నియోజకవర్గంలోని వందలాది మంది రైతులు ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటూ, కోట్లాది రూపాయలు నష్టపోయారని ఎమ్మెల్యే అన్నారు.
గతంలో కొందరు రైతులకు మాయమాటలు చెప్పి వారి భూములను పంజాబ్ కంపెనీకి విక్రయించేలా చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఒక రైతు భూమి విక్రయించినప్పుడు, అదే సర్వే నంబరులో ఉన్న ఇతర రైతుల భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. సమస్యను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో బాధిత గ్రామాల్లో రెవెన్యూ గ్రామసభల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..