
లక్నో/సుల్తాన్పూర్, 26 అక్టోబర్ (హి.స.)
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వాహన శ్రేణి (కాన్వాయ్) వెనుక వస్తున్న వాహనాలు ప్రమాదానికి గురైన ఘటనపై విచారణ చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ మూడు సభ్యుల ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) ఈ విచారణ బృందాన్ని నియమిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
లక్నో నుంచి సుల్తాన్పూర్ జిల్లాలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు రాహుల్ గాంధీ బయలుదేరిన సమయంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హలియాపూర్ సమీపంలో కాన్వాయ్ వెనుకాల వస్తున్న అంబులెన్స్, కాంగ్రెస్ నేతల నాలుగు కార్లు సహా దాదాపు ఐదు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడగా, వెనుక ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తున్న పలువురు పార్టీ నాయకులు, భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.
ఉన్నత స్థాయి ఎస్ఐటీ పర్యవేక్షణ
ఈ ఘటన ప్రాధాన్యత, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరపాలని డిజిపి ఆదేశించారు. ఈ ఎస్ఐటీ బృందానికి లక్నో రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) కిరణ్ ఎస్ నాయకత్వం వహించనున్నారు.
కమిటీలో సభ్యులుగా సుల్తాన్పూర్ అదనపు ఎస్పీ బ్రజ్ నారాయణ్ సింగ్, సుల్తాన్పూర్ ట్రాఫిక్ డిఎస్పీ రామ్ కృష్ణ చతుర్వేది వ్యవహరిస్తారు. ప్రమాదానికి గల కారణాలు, కాన్వాయ్ రవాణా, భద్రతా ఏర్పాట్లలో ఏవైనా లోపాలు జరిగాయా అనే కోణాల్లో అధ్యయనం చేసి త్వరితగతిన నివేదిక సమర్పించాలని డీజీపీ ఎస్ఐటీకి స్పష్టం చేశారు. Future లో ఇటువంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలను కూడా ప్రతిపాదించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi