లూలా డా సిల్వా నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నిక
లూలా డా సిల్వా నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు
brazil


brazil


బ్రాసిలియా (బ్రెజిల్), అక్టోబర్ 26 (హిం. స): దేశ ప్రస్తుత అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా మరోసారి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన నాల్గోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వామపక్ష నేత అయిన 80 ఏళ్ల లూలా మాజీ ఫ్యాక్టరీ కార్మికుడు. ఎన్నికల మొదటి దశలో అధ్యక్ష పదవికి అభ్యర్థిగా బరిలో నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు ఫ్లేవియో బోల్సోనారో మరియు ప్రస్తుత అధ్యక్షుడు లూలా మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఆదివారం జరిగిన ముగింపు పోరులో (రన్-ఆఫ్) ఆయన ఫ్లేవియో బోల్సోనారోను ఓడించారు.

బ్రెజిల్ ప్రముఖ పత్రిక ఫోల్యా దే ఎస్ పాఉలో మరియు సిఎన్‌ఎన్ నివేదికల ప్రకారం, 99.77% ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత రెండో విడతలో ప్రస్తుత అధ్యక్షుడికి 51.76% చెల్లబడే ఓట్లు లభించగా, బోల్సోనారోకు 48.24% ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో 'వర్కర్స్ పార్టీ' సభ్యుడైన లూలా, గెటులియో వర్గాస్ తర్వాత బ్రెజిల్ చరిత్రలో అత్యధిక కాలం అధ్యక్ష పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా నిలిచారు. తన ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యే నాటికి ఆయన మొత్తం 16 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. బ్రెజిల్ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక రికార్డు.

ద్రవ్యోల్బణం, నేరాలు, అవినీతి వంటి అంశాలు ప్రధానంగా నిలిచిన ఎన్నికల ప్రచారం తర్వాత ఈ విజయం లభించింది. సిఎన్‌ఎన్ నివేదిక ప్రకారం, 1989లో ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలు పునరుద్ధరించబడిన తర్వాత, మొదటి విడతలో రెండో స్థానంలో నిలిచిన ఏ అభ్యక్షుడైనా సరే అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం ఇదే మొదటిసారి. లూలా 2003 నుంచి 2010 మధ్య తొలిసారి బ్రెజిల్‌ను పాలించారు. ఈసారి ఆయనకు పెరుగుతున్న దద్రవ్యోల్బణం, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కఠినమైన ఎన్నికల పోరును ఎదుర్కోవాల్సి వచ్చింది. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా బోల్సోనారో నేరాలపై కఠిన వైఖరిని ప్రధాన అంశంగా మలిచారు. అలాగే ఆహార పదార్థాల ధరలను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఇద్దరు ప్రధాన అభ్యర్థులపై వారి కుటుంబ సభ్యులు, సహచరులకు సంబంధించి అవినీతి ఆరోపణలు వచ్చాయి.

అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో లూలా ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అయితే తర్వాతి కాలంలో ఆ దోష నిర్ధారణలు రద్దు చేయబడ్డాయి. ఆదివారం జరిగిన ఈ హోరాహోరీ పోరు ఫలితాలు తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడ్డాయి. లూలా విజయం ప్రభావం బ్రెజిల్ సరిహద్దులు దాటి కూడా కనిపిస్తుందని సిఎన్‌ఎన్ విశ్లేషించింది. లూలా నాయకత్వంలో ల్యాటిన్ అమెరికాలోని ఈ అతిపెద్ద దేశం మరింత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించనుంది. బ్రెజిల్ సార్వభౌమత్వాన్ని లూలా బలంగా నొక్కిచెప్పారు. అదేవిధంగా 'గ్లోబల్ సౌత్' (అభివృద్ధి చెందుతున్న దేశాలు) మరియు చైనాతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఆయన వాదించారు. 1970వ దశకంలో కార్మిక నేతగా లూలా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 'వర్కర్స్ పార్టీ' ఏర్పాటులో ఆయన కీలక సహాయం అందించారు.

బోల్సోనారో రాజకీయ ఉద్యమానికి లూలా విజయం ఒక పెద్ద ఎదురుదెబ్బ. గతంలో 2022లో మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కూడా సాధించలేకపోయిన దానిని, ఆయన కుమారుడు ఫ్లేవియో సాధించలేకపోయారు. అనగా ఎన్నికల్లో లూలాను ఓడించడంలో వారు విఫలమయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande