తుమ్మిడిహెట్టి బ్యారేజీపై తెలంగాణ, మహారాష్ట్ర సీఎంల సానుకూల చర్చలు
తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి జరిగిన సమావేశం ముగిసింది.
TUMMIDIATTI


తుమ్మిడిహెట్టి, 26 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి జరిగిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో బ్యారేజీ నిర్మాణం, ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రాంతాలకు పరిహారం వంటి కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల నేతలు చర్చించారు. ప్రాజెక్టు విషయంలో ముందుకు సాగేందుకు సానుకూల వైఖరిని వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం 148 మీటర్ల ఎత్తుతో ఉన్న బ్యారేజీ ఒప్పందాన్ని పునఃపరిశీలించి, అవసరమైతే ఎత్తును 152 మీటర్లకు పెంచే అంశాన్ని పరిశీలించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర అధ్యయనం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన అధికారుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. నీటి లభ్యత, బ్యారేజీ ఎత్తు వల్ల కలిగే ప్రయోజనాలు, ముంపు ప్రభావం, పరిహారం చెల్లింపులు తదితర అంశాలను కమిటీ పరిశీలించనుంది. కేంద్ర జల సంఘం (CWC) నివేదికలు, కాంటూర్ మ్యాపులను కూడా నిర్ణయాలకు ప్రాతిపదికగా తీసుకోనున్నారు.

ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో సాగునీరు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande