ఉపగ్రహ సమాచారంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ అంచనా
ఎల్నినో ప్రభావంతో మారే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన విద్యుత్ను సకాలంలో అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక దృష్టి సారించింది.
విద్యుత్ మీటింగ్


హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

ఎల్నినో ప్రభావంతో మారే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన విద్యుత్ను సకాలంలో అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక దృష్టి సారించింది.

వ్యవసాయ విద్యుత్ డిమాండ్ను ముందుగానే అంచనా వేసి, సరఫరాను సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో నేడు సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి. పటేల్ పాల్గొన్నారు.

ఎన్ఆర్ఎస్సీ విశిష్ట శాస్త్రవేత్త, సమగ్ర అధిపతి డాక్టర్ ప్రకాశ్ చౌహాన్ ఆహ్వానం మేరకు ఈ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా మండలాల వారీగా పంటల పరిస్థితి, సాగునీటి అవసరాలు, భూగర్భ జలాల లభ్యతతో పాటు ఉపగ్రహ చిత్రాల ద్వారా సేకరించే సమాచారాన్ని విద్యుత్ శాఖ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అంశాలపై చర్చించారు.

ఉపగ్రహ ఆధారిత సమాచారం, భూగర్భ జలాల వివరాలను విద్యుత్ వినియోగ గణాంకాలతో అనుసంధానం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో విద్యుత్ అవసరాలను ముందుగానే గుర్తించవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. దీనివల్ల రైతులకు విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించడంతో పాటు, వాతావరణంలో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను మెరుగ్గా నిర్వహించే అవకాశం ఉంటుందని వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande