
న్యూఢిల్లీ:, 27 అక్టోబర్ (హి.స.)
జాతీయ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక 'భారత్ మండపం' వేదికగా జరగనున్న 'ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్ (ESTIC) 2026'ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు అధికారికంగా ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బయోటెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, తయారీ రంగం, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం మరియు వాతావరణ మార్పులు వంటి కీలక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతలు, భారత్ ఆవిష్కరణ ప్రాధాన్యతలపై సమగ్రంగా చర్చించనున్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అక్టోబర్ 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. ఈ సదస్సులో దేశవిదేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, విధానకర్తలు, పరిశ్రమల ప్రతినిధులు, నూతన స్టార్టప్‌ల నిర్వాహకులు మరియు అంతర్జాతీయ నిపుణులు పాల్గొననున్నారు. మొత్తం 12 ప్రధాన అంశాల ఆధారంగా లోతైన చర్చలు సాగనున్నాయి. దేశీయ పరిశోధన ప్రాధాన్యతలు, జాతీయ సామర్థ్యాల బలోపేతం మరియు సాంకేతిక ఆవిష్కరణలను ఆచరణాత్మక వినియోగంలోకి తీసుకురావడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
స్వదేశీ పరిజ్ఞానం - 150 డీప్-టెక్ స్టార్టప్‌ల ప్రదర్శన
సదస్సులో భాగంగా భారత్ సాధించిన స్వదేశీ శాస్త్ర సాంకేతిక పురోగతిని, ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. లోతైన సాంకేతికత (డీప్-టెక్) రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసిన సుమారు 150 కి పైగా స్టార్టప్ సంస్థలు తమ స్టాళ్లను ఇక్కడ ప్రదర్శించనున్నాయి. వివిధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిన మార్పులు, వాటి భవిష్యత్ వినియోగాన్ని ఈ స్టాళ్ల ద్వారా వివరించనున్నారు.
వీటితో పాటు ప్రత్యక్ష సాంకేతిక ప్రదర్శనలు, డాక్యుమెంటరీలు, ఇన్ఫర్మేషన్ డెస్క్‌లు మరియు అగ్మెంటింగ్ & వర్చువల్ రియాలిటీ (AR/VR) డిజిటల్ అనుభూతుల ద్వారా శాస్త్రీయ రంగాలు సాధించిన ప్రగతిని, దైనందిన జీవితంలో వాటి ఉపయోగాలను సందర్శకులకు కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.
అంతర్జాతీయ భాగస్వామ్యం - 'గ్లోబల్ కనెక్ట్ నెట్వర్కింగ్'
ఈ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా ‘గ్లోబల్ కనెక్ట్ నెట్వర్కింగ్ ప్రోగ్రామ్’ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారత్‌తో పాటు విదేశాలకు చెందిన ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, పారిశ్రామిక రంగానికి చెందిన 300 మందికి పైగా ప్రతినిధులు ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్నారు.
అంతర్జాతీయ స్థాయి పరిశోధన భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, పరిశ్రమలు మరియు పరిశోధనా సంస్థల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ప్రయోగశాలల (లాబ్‌ల) పరిధిలోనే ఆగిపోకుండా నూతన ఆవిష్కరణలను నేరుగా వాణిజ్య మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు అవసరమైన మార్గాలను ఈ వేదిక ద్వారా అన్వేషించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi