
న్యూఢిల్లీ:, 28 అక్టోబర్ (హి.స.)
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ విమర్శలు తీవ్రతరమయ్యాయి. దీనికి కౌంటర్‌గా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా 'మోదీ కహీన్ నహీ జాయేగా' (మోదీ ఎప్పటికీ ఎక్కడికీ వెళ్లరు) అంటూ ఒక ప్రత్యేక పాటను విడుదల చేసింది. దేశ ప్రజల మద్దతుతో ప్రధాని మోదీ మరింత ముందుకు సాగుతారనే సందేశాన్ని ఈ గీతం ద్వారా బీజేపీ బలంగా వినిపిస్తోంది.
పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోదీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు వెంటనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ కొత్త మ్యూజిక్ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేశారు. పీయూష్ గోయెల్, సంబిత్ పాత్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, అన్నపూర్ణా దేవి తదితరులు ఈ పాటను తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల ద్వారా పోస్ట్ చేశారు.
ఈ గీతంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ బలమైన పదాలు ఉపయోగించారు. మీరు ఎన్ని విమర్శలు గుప్పించినా, సింహం లాంటి నాయకుడు ఎప్పటికీ వెనకడుగు వేయడని, ప్రజల అండతో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఈ పాట స్పష్టం చేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, ఈ దేశం మోదీ వెంటే ఉంటుందని పాట ద్వారా గట్టి సందేశం పంపారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శల క్లిప్పింగ్‌లను పంచుకుంటూ బీజేపీపై ఎదురుదాడికి దిగింది. ఓట్ల చోరి ఆరోపణలు, నవంబర్ 1న ఇండియా కూటమి ఆధ్వర్యంలో తలపెట్టిన 'ఢిల్లీ చలో' మార్చ్‌తో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఖర్గే వ్యాఖ్యల వివాదం ముదురుతున్న తరుణంలో బీజేపీ విడుదల చేసిన ఈ ప్రచార గీతం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi