ఈ-సిగరెట్లు, వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠాలపై డీఆర్ఐ దాడులు
దేశంలో అక్రమ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముఠాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు కీలక చర్యలు చేపట్టారు.
Ap police


కోల్కతా, 28 అక్టోబర్ (హి.స.)

దేశంలో అక్రమ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముఠాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు, వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్న అంతర్జాతీయ ముఠా కార్యకలాపాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

కోల్కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో అధికారులు రెండు వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.13.5 కోట్లకు పైగా విలువైన 55 వేల ఈ-సిగరెట్లను పట్టుకున్నారు. వీటిని అక్రమంగా దేశంలోకి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సరుకు వెనుక ఉన్న వ్యక్తులు, స్మగ్లింగ్ నెట్వర్క్కు సంబంధించిన వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరోవైపు, తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో వన్యప్రాణుల అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. బ్యాంకాక్ నుంచి కొలంబో మీదుగా వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి 45 వన్యప్రాణులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరినీ అరెస్టు చేశారు. వన్యప్రాణులకు మత్తుమందు ఇచ్చి, ఆహార ప్యాకెట్లలో దాచి తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

అక్రమ రవాణాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, సముద్ర నౌకాశ్రయాల్లో నిఘాను మరింత పెంచినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande