
న్యూఢిల్లీ:, 28 అక్టోబర్ (హి.స.)
టాటా సన్స్ సంస్థలో నాయకత్వ మార్పులు మరియు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకం చుట్టూ చెలరేగిన అంతర్గత విభేదాల నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ వ్యాపార రంగాన్ని, దిగ్గజ సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తమ సొంత ఆటబొమ్మలుగా మార్చుకున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. టాటా సన్స్ వివాదం దేశీయ కార్పొరేట్ రంగానికి సంబంధించిన స్వయంప్రతిపత్తిపై పెద్ద ప్రశ్న గుర్తుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
సామాజిక మాధ్యమ వేదికగా కేంద్ర వైఖరిని ఎండగట్టిన రాహుల్ గాంధీ, శతాబ్దాల చరిత్ర కలిగిన టాటా గ్రూప్‌ను నేరపూరితంగా నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వినాశనం కళ్లముందే జరుగుతున్నప్పటికీ దేశంలోని ఇతర వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ప్రముఖులు పెదవి విప్పకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లు మరియు బెదిరింపులకు భయపడి వ్యాపార ప్రముఖులు ఎంతకాలం ఈ రకమైన మౌనాన్ని పాటిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం దేశంలోని వ్యవస్థలన్నింటినీ పూర్తిగా తమ గుప్పెట్లోకి తీసుకునే వరకు కార్పొరేట్ రంగానికి చెందిన నాయకులు ఇలాగే ఊరుకుంటారా అని ఆయన గట్టిగా నిలదీశారు.
ఈ సందర్భంగా దేశ వ్యాపారవేత్తల ధైర్యాన్ని ప్రశ్నించిన ఆయన, కేంద్ర పెద్దల అక్రమాలను నిలదీసే ధైర్యం కార్పొరేట్ నాయకులకు లేకపోయినా తమకు మాత్రం ఆ ధైర్యం ఉందని స్పష్టం చేశారు. భారతీయ వ్యాపారాలు ఎవరి సొంత ఆస్తి కాదని, కేంద్రం ఆడుకోవడానికి ఇవి ఆటబొమ్మలు అంతకంటే కాదని ఆయన హితవు పలికారు. టాటా గ్రూప్‌లో జరుగుతున్న పరిణామాలపై తాము మౌనంగా ఉండేది లేదని, ఈ వ్యవహారంలో జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా పోరాడి తీరతామని చెప్పారు. విపక్ష నేతగా ఈ ఆక్రమణల నుంచి దేశీయ సంస్థలను కాపాడి కచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని రాహుల్ గాంధీ తన ప్రకటనలో హామీ ఇచ్చారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ నియామకాన్ని పునరుద్ధరిస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా తీవ్రంగా నిరసించడమే. నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్ణయం జరిగిందని ఆయన అభ్యంతరం తెలపడంతో గ్రూప్‌లో బోర్డు స్థాయి విభేదాలు బయటపడ్డాయి. ఈ అంతర్గత వివాదంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ నేరుగా కేంద్ర ప్రభుత్వం వైపు వేళ్లు చూపించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాహుల్ గాంధీ చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు టాటా గ్రూప్ యాజమాన్యం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi