క్రీడాలోకంలో తీవ్ర విషాదం: పారా అథ్లెట్, స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య
క్రీడాలోకంలో తీవ్ర విషాదం: పారా అథ్లెట్, స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య
neeraj


న్యూఢిల్లీ, 28 అక్టోబర్ (హి.స.)

: భారత క్రీడారంగంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు పలు పతకాలు అందించి దేశ ఖ్యాతిని చాటిన ప్రముఖ పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ (42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఢిల్లీలోని మౌజ్‌పూర్ ప్రాంతంలో రహదారి పక్కన ఉన్న వాహనంలో ఆయన స్పృహతప్పి పడిపోగా, వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఏడేళ్ల వయసులోనే పోలియో బారిన పడి వైకల్యాన్ని ఎదుర్కొన్న నీరజ్ యాదవ్.. పట్టుదలతో క్రీడారంగంలోకి అడుగుపెట్టారు. వీల్‌చైర్ టెన్నిస్‌తో తన క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌లోకి మారి జావెలిన్ త్రో, డిస్కస్ త్రో అంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. 2018 జకార్తా ఆసియా పారా గేమ్స్‌లో జావెలిన్ త్రోలో పసిడి పతకం సాధించిన ఆయన, 2023 హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకున్నారు.

అయితే, ఇటీవల నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో విఫలం కావడంతో ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) ఆయనపై 4 ఏళ్ల నిషేధం విధించింది. దీనితో పాటు ఆయన గెలుచుకున్న రెండు పసిడి పతకాలను కూడా అధికారులు ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి, మానసిక ఒత్తిడికి గురైన నీరజ్ యాదవ్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన కోచ్, క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande