పబ్లిగ్గా బుగ్గగిల్లిన ఆకతాయి.. షాకైన హీరోయిన్ రచితా రామ్ .. వీడియో వైరల్
పబ్లిగ్గా బుగ్గగిల్లిన ఆకతాయి.. షాకైన హీరోయిన్ రచితా రామ్ .. వీడియో వైరల్
రచితా రామ్ .


బెంగళూరు, 03 అక్టోబర్ (హి.స.)పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లినప్పుడు సినీ తారలకు అభిమానుల నుంచి విచిత్రమైన, కొన్నిసార్లు ఇబ్బందికరమైన అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి.

ఈ రోజు అక్టోబర్ 3న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలుసుకున్న ఆమెకు ఓ అభిమాని ఊహించని రీతిలో షాకిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలుసుకోవడం రచితా రామ్కు అలవాటు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

వారితో ఫొటోలు దిగుతూ, సెల్ఫీలు ఇస్తూ రచితా రామ్ సందడి చేస్తారు. ఈ ఏడాది కూడా తన అభిమానులతో కొంత సమయం గడిపిన ఆమె.. చాలామందితో సెల్ఫీలు దిగారు. అయితే ఈ క్రమంలో ఓ అభిమాని చేసిన పని మాత్రం అందరి అవాక్ అయ్యేలా చేసింది.

ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేక ఆమె వారితో ఓపిగ్గా ఫొటోలకు ఫోజులిస్తూ ముందుకు సాగారు. రచితా రామ్ దగ్గరకు వచ్చిన ఓ అభిమాని ముందుగా ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. ఫొటో దిగడం పూర్తయిన మరుక్షణమే.. అతను ఏమాత్రం సంకోచించకుండా పబ్లిగ్గా నటి రెండు బుగ్గలను చేతులతో పట్టుకున్నాడు. ఆ ఆకతాయి హఠాత్తుగా చేసిన ఈ అనుచిత చర్యతో రచితా రామ్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక ఆమె తన చేతితో బుగ్గను తడుముకుంటూ అవాక్కయి చూశారు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పక్కకు నెట్టివేశారు. అంతటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పటికీ, రచితా రామ్ తన హుందాతనాన్ని కోల్పోకుండా సంయమనం పాటిస్తూ, అక్కడున్న మిగతా అభిమానులతో చిరునవ్వుతోనే ముందుకు కదిలారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం పేరుతో మహిళా సెలబ్రిటీల వ్యక్తిగత ప్రైవసీని ఉల్లంఘించడం, ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదని మండిపడుతున్నారు. పబ్లిక్ ఈవెంట్లలో హీరోయిన్లకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande