
కదిరి , 03 అక్టోబర్ (హి.స.)ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహిస్తు న్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు.
కదిరి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఈ రోజు శనివారం ఉదయం ప్రజా దర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులకు చెందిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమం, అభివృద్ధి అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
అనధికార లేఅవుట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపాలిటీ అనుమతి పొందిన లేఅవుట్లలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఆమోదిత లేఅవుట్లలో ప్రణాళికాబద్ధమైన పట్టణ అభివృద్ధికి అవకాశం ఉంటుందని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV