
అమరావతి, 03 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కూడా సంభవిస్తాయని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో వాతావరణం మారుతోంది.
ఆంధ్రప్రదేశ్లో వర్షాల ప్రభావం
కోస్తాంధ్ర ప్రదేశ్, యానాం ప్రాంతాలలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాయలసీమ జిల్లాలలో కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలోనూ పలు చోట్ల వానలు
తెలంగాణలో ఇటీవల వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఆ వాయుగుండం బలహీనపడినప్పటికీ, ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మళ్లీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉంది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు అలాగే బయటికి వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV