
అమరావతి , 30 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో నేడు సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం రెండు రోజుల ముందుగానే పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. సాధారణంగా నెల ప్రారంభంలో అందించే పెన్షన్లను ఈసారి ఎన్నికల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పెన్షన్‌దారులకు ముందుగానే ఆర్థిక సహాయం అందనుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందించేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు నగదు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టనున్నారు.
ఎన్నికల నేపథ్యంలో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. పెన్షన్‌దారులు తమకు కేటాయించిన సిబ్బందిని సంప్రదించి నగదు అందుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో నెలవారీ పెన్షన్‌పై ఆధారపడే లక్షలాది కుటుంబాలకు ముందుగానే ఆర్థిక వెసులుబాటు కలగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్