
అమరావతి , 30 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ను ప్రకటించింది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి అందిన క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిష్కరించేందుకు అదనపు సమయం కేటాయించింది.
తాజా నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 20వ తేదీ వరకు, తెలంగాణలో నవంబర్ 26వ తేదీ వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారానికి గడువు ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం నవంబర్ 30వ తేదీన రెండు రాష్ట్రాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు సవరించిన షెడ్యూల్లో పేర్కొంది.
గడువు పొడిగింపుతో ఓటర్ల వివరాల్లో మార్పులు కోరుకునే వారికి మరింత అవకాశం లభించనుంది. అర్హులైన ఓటర్లు తమ పేర్ల నమోదు, వివరాల్లో తప్పుల సవరణ కోసం నిర్దేశిత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అలాగే సవరించిన షెడ్యూల్కు సంబంధించిన వివరాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఈ కొత్త గడువులు, ఎన్నికల సంఘం చేపట్టిన మార్పులపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కూడా సమాచారం అందించాలని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగానికి స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్