విజయవాడలో నేడు బీజేపీ ‘సేవా జ్యోతి యాత్ర’.. భారీ బైక్ ర్యాలీకి ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేడు సేవా జ్యోతి యాత్ర నిర్వహించనున్నారు.
Bjp


అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేడు సేవా జ్యోతి యాత్ర నిర్వహించనున్నారు. విజయవాడలో ఉదయం 10 గంటలకు బైక్ ర్యాలీ చేపట్టేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

దేశవ్యాప్తంగా అక్టోబర్ 7న వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఏపీలో కూడా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యువత, మహిళలు, సామాజిక వర్గాలు, పార్టీ కార్యకర్తలను కలుపుకుని సేవా కార్యక్రమాలను నిర్వహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు రక్తదాన శిబిరాలు, యువత కోసం ఇన్నోవేషన్ కార్యక్రమాలు, అంగన్వాడీ సంబంధిత సేవా కార్యక్రమాలు, ఇతర ప్రజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బీజేపీ తెలిపింది. యువతలో స్టార్టప్లు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ ఛాలెంజ్ను కూడా నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. దానికి రూ.5.4 కోట్ల వరకు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని పార్టీ నేతలు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande