
అమరావతి , 09 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విజయవాడ వేదికగా ఈరోజు (అక్టోబర్ 9) నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల భౌతిక పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. గతంలో అగ్రిగోల్డ్ సంస్థలో డబ్బులు దాచుకుని మోసపోయిన చిన్న, మధ్యతరహా డిపాజిటర్ల బాండ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. బాధితులు తమ అసలు బాండ్లు, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ప్రతులతో హాజరవుతున్నారు. మొదటి విడతలో భాగంగా తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తూ, వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేందుకు వీలుగా ఈ డేటా సేకరిస్తున్నారు. ఎక్కడా దళారుల ప్రమేయం లేకుండా, అర్హులైన అసలైన బాధితులకు మాత్రమే సొమ్ము అందేలా పారదర్శకమైన సాఫ్ట్వేర్ విధానాన్ని వాడుతున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో వేలాది మంది బాధితుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్