
న్యూఢిల్లీ, 09 అక్టోబర్ (హి.స.)
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్
కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో..కాక్రోచ్ జనతా పార్టీ రాజధాని ఢిల్లీలో రేపు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 10న జంతర్ మంతర్, న్యూఢిల్లీ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరగనున్న నిరసనలు, ఆందోళనకారుల కదలికలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 57 మెట్రో స్టేషన్ల ఎంట్రీలు, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ విషయాన్ని ఇవాళ ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ కార్యాలయం నుంచి అధికారిక సమాచారం వెలువడింది.
డీఎంఆర్సీ ఉత్తర్వుల ప్రకారం.. అక్టోబర్ 9 అంటే ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. జాన్పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు, కాశ్మీర్ గేట్, చాందినీ చౌక్ వంటి కీలక ప్రాంతాలతో సహా మొత్తం 57 మెట్రో స్టేషన్లలో ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు ఢిల్లీలో తలపెట్టిన నిరసనలు, భారీ ట్రాఫిక్ రద్దీ, భద్రతా కారణాల దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకునే పలు రైళ్లపై దీని తీవ్ర ప్రభావం పడనుంది. అక్టోబర్ 10 ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు రైళ్ల రాకపోకలపై ప్రత్యేక ఆంక్షలు అమల్లో
ఉంటాయని తెలియజేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..