
హైదరాబాద్ , 09 అక్టోబర్ (హి.స.)తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు ఈరోజు నుండి అధికారికంగా దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ముందే ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 18న జరిగే సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 19న మహానవమి, అక్టోబర్ 20న విజయదశమి పండుగలను కలుపుకుని ఈ సుదీర్ఘ సెలవులను కేటాయించారు.
ఈరోజు ఉదయం విద్యాసంస్థల చివరి పనిదినం కావడంతో స్కూళ్లలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అమర్చి, సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటాపాటలతో విద్యాసంస్థల ఆవరణలను సందడిగా మార్చేశారు. ఈ సెలవుల కారణంగా హైదరాబాద్ మహానగరం నుండి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) లతో పాటు జాతీయ రహదారులపై భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. ప్యాసింజర్ల ఇబ్బందులను అధిగమించడానికి రవాణా శాఖ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్