
నల్గొండ, 09 అక్టోబర్ (హి.స.) నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ వారికి దుస్తులు, వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను పంపిణీ చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన భూత్పూర్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కార్మికులకు విధుల నిర్వహణలో ఉపయోగపడే రక్షణ సామగ్రిని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చెత్త సేకరణ, వీధుల శుభ్రత, ఇతర పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికులు తమ ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. విధుల సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. దుమ్ము, ధూళి, వ్యర్థ పదార్థాల వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలను తగ్గించుకోవడానికి పీపీఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..