
భూపాలపల్లి, 09 అక్టోబర్ (హి.స.)
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
భూపాలపల్లి నియోజకవర్గ మంజునగర్లో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్మేళాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.గత రెండేళ్లలో 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాల ద్వారా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించామన్నారు. ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు పెంచేందుకు జాబ్మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేళాలో 118 కంపెనీల ప్రతినిధులు పాల్గొనడం అభినందనీయమన్నారు.
యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. కేవలం డిగ్రీలు, పీజీలు ఉంటే సరిపోదని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రారంభంలో తక్కువ వేతనం వచ్చినా అనుభవం, నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్తులో రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం పొందే అవకాశాలుంటాయన్నారు.
ఉద్యోగం ఎక్కడ లభించినా స్వీకరించి, అనుభవంతో ఉన్నత స్థాయికి ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు