
అమరావతి , 09 అక్టోబర్ (హి.స.)విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచే ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. పవిత్ర కృష్ణా నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కాలినడకన, ఘాట్ రోడ్డు మార్గాల ద్వారా కొండపైకి చేరుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో, అధికారులు తక్షణమే స్పందించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. వృద్ధులు, చిన్న పిల్లలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక మంచినీరు, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శీఘ్ర దర్శనం (రూ.300, రూ.500 టికెట్లు) లబ్ధిదారులకు కూడా వేగంగా దర్శన భాగ్యం కల్పించేలా క్యూ లైన్ల సామర్థ్యాన్ని పెంచారు. దుర్గమ్మ దర్శనం కోసం పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివస్తుండటంతో విజయవాడ నగరమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్