
నిజామాబాద్, 09 అక్టోబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియకు రైతులు తమ వంతు బాధ్యతగా సహకరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు.
రైతులు, భూ యజమానుల ప్రయోజనాలను కాపాడుతూ, భవిష్యత్తులో వారికి ఎలాంటి భూ సమస్యలు తలెత్తకూడదు అనే సదుద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే జరిపిస్తోందని కలెక్టర్ వెల్లడించారు.
ఈ ప్రక్రియకు రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. సాలూర మండలం ఫతేపూర్ లో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం అదనపు కలెక్టర్ వి.భుజంగరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, రోవర్ సహాయంతో సర్వే నిర్వహిస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ, నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..