విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి. ఎస్పీ మహేష్ బి. గితే
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.
Sp


రాజన్న సిరిసిల్ల, 09 అక్టోబర్ (హి.స.)

రేపటి భావి భారత పౌరులైన నేటి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన 100 రోజుల త్రివర్ణ పతాక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి విద్యా సంవత్సరంలో 100 రోజుల పాటు జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించడంతో పాటు దేశం పట్ల గౌరవం, బాధ్యతను పెంచుతాయని తెలిపారు.అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకోవాలని సూచించారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే బాధ్యతగల పౌరులుగా ఎదగాలని ఎస్పీ సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను గుర్తించాలని, వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేసి మాదకద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలని కోరారు.

ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, మైనర్ల డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్లో ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఇతరులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఎస్పీ విద్యార్థులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande