
సిద్దిపేట, 09 అక్టోబర్ (హి.స.) కరెంటు కోతలు మరియు అస్తవ్యస్త సరఫరాపై సిద్దిపేట జిల్లా రైతులు కన్నెర్ర చేశారు. కోతలు లేకుండా వ్యవసాయనికి సరిపడా కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మరుమాముల, సలాకపూర్, లద్దునూర్, ధర్మారం గ్రామాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో మరుమాముల విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ఏడు గంటల విద్యుత్తు మాత్రమే అందడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయానికి సరిపడా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేదన్నారు.ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రైతులకు సరిపడా విద్యుత్ అందడం లేదని విమర్శించారు.
వర్షాకాలంలో పంటలు ఎండిపోయిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని ప్రస్తుతం కరెంటు వల్లనే పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు అందించే వరకు రైతులమంతా ఉద్యమించనున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..