
అమరావతి , 09 అక్టోబర్ (హి.స.)వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తాను త్వరలోనే ఒక సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు విజయసాయిరెడ్డి అధికారికంగా ప్రకటించారు. నూతన పార్టీ ఆవిర్భావానికి ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికే తిరుమల వచ్చినట్లు చెప్పారు. తనతో పాటు పని చేసేందుకు పాత సహచరుడు ఓవీ రమణను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు అసలైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని, సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా తమ పార్టీ నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసేలా కనిపిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్