
ఢిల్లీ, 09 అక్టోబర్ (హి.స.)బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా 34శాతం బీసీ రిజర్వేషన్లకు నో చెప్పింది.
ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది.. 34శాతం బీసీ రిజర్వేషన్లను నిరాకరించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, శీల్నాగ్తో కూడి ధర్మాసనం తీర్పు వెల్లడించింది. సుప్రీం కోర్టు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వడంతో.. ఏపీ ఎన్నికల సంఘం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (BC) తగిన ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం జీవోలను జారీ చేసింది. ఇందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, వాదన సదర్భంగా క్షేత్రస్థాయి జనాభా లెక్కలు, ఎంపిరికల్ డేటా (Empirical Data) ఆధారంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని, స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించారు. ఈ క్రమంలోనే జస్టిస్ దీపాంక్ దత్తా, జస్టిస్ శీల్నాగ్ ద్విసభ్య ధర్మాసనం కలుగజేసుకుని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ధమైన 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ను దాటడానికి ఏమాత్రం వీలులేదని చెప్పింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ తాజా పరిణామాలు ఏపీ రాజకీయాల్లోనూ, స్థానిక ఎన్నికల ప్రక్రియలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సుప్రీం కోర్టు తాజా తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు దసరా తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద సుప్రీం కోర్టు బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై నో చెెప్పింది.. మరి పార్టీలు ఈ రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తాయన్నది చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV