
అమరావతి , 01 నవంబర్ (హి.స.)
విజయవాడ నగరంలోని 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణలో జరిగిన పొరపాటు ఎన్నికల ప్రక్రియలో గందరగోళానికి దారితీసింది. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ రాజరాజేశ్వరి పేటలో అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఇతర పార్టీలకు చెందిన గుర్తులు ముద్రితమయ్యాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరుకు ఎదురుగా కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తం కనిపించగా, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు పక్కన వైఎస్సార్సీపీ గుర్తు అయిన ఫ్యాన్ ముద్రించారు.
బ్యాలెట్ పేపర్లలో ఈ తప్పిదాన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్యను పరిశీలించిన పోలింగ్ రిటర్నింగ్ అధికారి చక్రవర్తి 55వ డివిజన్లో ఓటింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. తప్పుగా ముద్రించిన బ్యాలెట్ పత్రాలను పక్కనపెట్టి, సరైన గుర్తులతో కొత్త బ్యాలెట్ పేపర్లను ముద్రించే చర్యలు చేపట్టారు.
కొత్త బ్యాలెట్ పత్రాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల అధికారులు పోలింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ పరిణామంతో ఓటింగ్ ప్రక్రియ సుమారు రెండు గంటల పాటు ఆలస్యమైనట్లు సమాచారం. బ్యాలెట్ పత్రాల ముద్రణలో జరిగిన పొరపాటు కారణంగా ఓటర్లు, అభ్యర్థులు కొంత ఇబ్బందికి గురయ్యారు. ఎన్నికల నిర్వహణలో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్