
అమరావతి , 10 నవంబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయంతో నేతలు, ప్రజాప్రతినిధులు అతిగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులతో ఆయన రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించారు. ఎన్నికల ఫలితాలతో విజయ గర్వం తలకెక్కించుకోకుండా ప్రజలకు మరింత బాధ్యతాయుతంగా సేవలందించాలని స్పష్టం చేశారు.
2029 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే సమష్టిగా పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారం సొసైటీ, పంచాయతీ, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే పాలనను పూర్తిస్థాయిలో అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలని సూచించారు.ప్రజలకు నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి కేబినెట్ సమావేశంలో నిత్యావసర వస్తువుల ధరలతో పాటు జీఎస్డీపై కూడా సమీక్షించాలని నిర్ణయించారు. గతంతో పోలిస్తే కూరగాయల ధరలు కొంతమేర తగ్గాయని, ఇదే విధంగా బియ్యం ధరలు కూడా నియంత్రణలోకి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలపై ధరల భారం పడకుండా సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్