సీపీ బ్రౌన్ సేవలు తెలుగు ప్రజలకు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు
తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సీపీ బ్రౌన్) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
Chandrababu Naidu


అమరావతి , 10 నవంబర్ (హి.స.)

తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సీపీ బ్రౌన్) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవలు అందించిన గొప్ప వ్యక్తిగా బ్రౌన్ను కొనియాడారు. విదేశీయుడైనప్పటికీ తెలుగు భాషపై అపారమైన అభిమానం చూపించి, దాని అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు.

తెలుగు భాషా సంపదను భవిష్యత్ తరాలకు అందించడంలో సీపీ బ్రౌన్ పాత్ర ఎంతో కీలకమని చంద్రబాబు అన్నారు. తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించడంతో పాటు భాషకు సంబంధించిన విలువైన గ్రంథాలను వెలుగులోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు. ఆంధ్ర దీపికను తెలుగు ప్రజలకు అందించడంతో పాటు, తొలి తెలుగు శబ్దకోశంగా గుర్తింపు పొందిన బ్రౌన్ డిక్షనరీని రూపొందించి భాషాభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తుచేశారు.

తెలుగు భాషపై బ్రౌన్కు ఉన్న ప్రేమ, అభిమానం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు భాష గొప్పతనాన్ని కాపాడటంతో పాటు, భావితరాలకు భాషా వైభవాన్ని అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande