
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రైతులకు అవసరమైన బ్యాంకు రుణాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క బ్యాంకు అధికారులను ఆదేశించారు. రుణాల మంజూరులో ఆలస్యం లేకుండా చూడాలని సూచించారు. వర్షాభావ ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు కావాల్సిన సాయాన్ని వేగంగా అందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రుణ సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా పంట రుణాల మంజూరు, కరువు సహాయక కార్యక్రమాలపై ఈ సమావేశం నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు