
కామారెడ్డి, 10 నవంబర్ (హి.స.)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చిన్న ఎక్కులార గ్రామంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.
ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం, నీటి లభ్యతలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, అందుకే రైతులు పంటల సాగులో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎల్నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు పద్ధతులు, పంట యాజమాన్య మెళుకువలు, ప్రభుత్వ రాయితీలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఆయిల్ పామ్ తోటల్లో నీటి యాజమాన్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, సమర్థవంతంగా వాడుకోవాలని తెలిపారు. బిందు సేద్యం ద్వారా అవసరమైన మేరకు నీటిని అందించాలని, మొక్కల చుట్టూ తేమ నిలిచేందుకు మల్చింగ్ చేయాలని, కలుపు మొక్కలను అదుపులో ఉంచాలని సూచించారు. ఎండ తీవ్రత నుంచి మొక్కలను కాపాడటంతో పాటు, సిఫార్సు చేసిన మోతాదులోనే ఎరువులు వాడాలని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు