
పెద్దపల్లి, 10 నవంబర్ (హి.స.)
జిల్లాలో బియ్యం అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలను అరికట్టేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు జిల్లా వ్యాప్తంగా 50 బియ్యం దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 9 కేసులు పెట్టినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటీ, జై శ్రీరామ్ రకం బియ్యం రూ.79కు మించి అమ్మకూడదని స్పష్టం చేశారు.
ప్రతి దుకాణం ముందు బియ్యం ధరలు, రోజువారీ నిల్వ వివరాలతో కూడిన బోర్డులు పెట్టాలని, కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను స్టాక్ రిజిస్టర్లలో రాయాలని ఆదేశించారు. 26 కిలోల బస్తా పేరుతో 24 లేదా 25 కిలోల బియ్యం అమ్మితే మోసపూరిత కొలతల చట్టం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.
జిల్లాలో బియ్యం కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం అమ్మాలని వ్యాపారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, అక్రమ నిల్వలు, తూకాల్లో తేడాలు గుర్తిస్తే నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు