విద్యాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ
సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు.
Mp


పెద్దపల్లి, 10 నవంబర్ (హి.స.)

సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి చదువులు, పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో తాగునీటి సమస్యతో పాటు ఉపాధ్యాయుల కొరత ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన తెలుగు వ్యాసరచన పోటీల్లో మొదటి స్థానం తెచ్చుకున్న విద్యార్థిని సాయి విజ్ఞతకు సైకిల్ బహుమతిగా ఇస్తానని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాకా హయాంలో ఈ పాఠశాలకు ప్రహరీ గోడ కట్టడం జరిగిందని, పాఠశాలకు వచ్చిన ప్రతిసారీ కాకా సేవలను గుర్తుచేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇస్తానని, వాటర్ ప్లాంట్ ఏర్పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande