
విశాఖపట్నం , 11 నవంబర్ (హి.స.)
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేటి నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో అధికారులు, పార్టీ నేతలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13న విశాఖలో జరిగే పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
ముఖ్యంగా భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదస్సుకు అమిత్‌షా హాజరుకానున్నారు. అదే రోజు మహిళల అభివృద్ధి, సాధికారత లక్ష్యంగా నిర్వహించే ఉమెన్ అండ్ డెవలప్మెంట్ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. మహిళలకు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో మరింత ప్రాధాన్యం కల్పించే అంశాలపై ఈ సదస్సులో చర్చ జరగనుంది. ఈ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొని ప్రసంగించనున్నారు.
అలాగే ఈ నెల 13న సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాజకీయ, పరిపాలనా అంశాలపై కీలక సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమిత్‌షా పర్యటనతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్