ఏపీలో త్వరలో సాయంత్రం కోర్టులు.. రాత్రి 9 గంటల వరకు కేసుల విచారణ
ఆంధ్రప్రదేశ్లో త్వరలో సాయంత్రం వేళల్లో కోర్టుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. న్యాయస్థానాల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసులను తగ్గించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించి
Court


అమరావతి , 11 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో త్వరలో సాయంత్రం వేళల్లో కోర్టుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. న్యాయస్థానాల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసులను తగ్గించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. సాధారణ కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత కూడా విచారణలు కొనసాగించేలా ప్రణాళిక రూపొందిస్తోంది.

ఈ ప్రతిపాదన ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేకంగా కేసుల విచారణ చేపట్టనున్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, ఢిల్లీలో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించే యోచనలో కేంద్రం ఉంది. ఇందుకోసం పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల సేవలను కూడా వినియోగించుకోవాలని భావిస్తోంది. తద్వారా ప్రస్తుతం విధుల్లో ఉన్న న్యాయమూర్తులపై పని ఒత్తిడి తగ్గడంతో పాటు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. ప్రయోగాత్మక విధానం విజయవంతమైతే ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించే అవకాశముంది. అయితే ఈ విధానం అమలు, విధివిధానాలపై మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande