
విశాఖపట్నం , 11 నవంబర్ (హి.స.)
విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 12, 13 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సదస్సుకు హాజరుకానున్న పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులకు ఆయన స్వాగతం పలికారు.
ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ఒకే వేదికపైకి రానున్నారు. ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన వంటి అంశాలపై ఈ వేదికగా చర్చలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించి, పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఏపీ అభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్