భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్
నేడు తెల్లవారుజామున కోడిశలగూడెం గ్రామం ఒక్కసారిగా పోలీసుల తనిఖీలతో ఉలిక్కిపడింది.
Police


భద్రాద్రి కొత్తగూడెం, 11 నవంబర్ (హి.స.)

నేడు తెల్లవారుజామున కోడిశలగూడెం గ్రామం ఒక్కసారిగా పోలీసుల తనిఖీలతో ఉలిక్కిపడింది.

మొత్తం 52 ఇళ్లను సోదా చేసిన పోలీసులు 33 బైకులు, 4 ప్యాసింజర్ ఆటోలు, ఒక ట్రాక్టర్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో నిబంధనలు పాటించని 4 ద్విచక్ర వాహనాలకు జరిమానాలు వేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకంపాలెం గ్రామ పంచాయతీలో ఉన్న ఈ గ్రామంలో జరిగిన కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కు అశ్వారావుపేట సీఐ నాగరాజు నేతృత్వం వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలు, పాల్వంచ డీఎస్పీ సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. కేవలం సోదాలకే పరిమితం కాకుండా గ్రామస్తులకు పోలీసులు అవగాహన కూడా కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల వాడకం, అక్రమ రవాణా వల్ల కలిగే అనర్థాలను వివరించి యువతను హెచ్చరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సీఐ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande