
హైదరాబాద్ , 11 నవంబర్ (హి.స.)తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించడంతో పాటు, వివిధ సంస్థల పనితీరును పరిశీలించనున్నారు. ముందుగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఐటీ టవర్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఐటీ టవర్ అందుబాటులోకి రావడంతో స్థానిక యువతకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అనంతరం బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ)ని శ్రీధర్‌బాబు సందర్శించనున్నారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను పరిశీలించే అవకాశం ఉంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, క్యాంపస్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించనున్నారు.
అలాగే బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని కూడా మంత్రి సందర్శించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులు, కొనసాగుతున్న నిర్మాణ కార్యక్రమాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. పనులు నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అవసరమైన సూచనలు చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్