పెద్దపల్లి నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత.. ఎమ్మెల్యే
ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల ప్రజలకు జమ్మికుంట, హుజురాబాద్, వరంగల్ ప్రాంతాలకు రాకపోకలు సులభతరం కానున్నాయి
Mla


పెద్దపల్లి, 11 నవంబర్ (హి.స.)

ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల ప్రజలకు జమ్మికుంట, హుజురాబాద్, వరంగల్ ప్రాంతాలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట వద్ద మానేరు వాగుపై జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామం వరకు రూ.80 కోట్లతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించి తిరిగి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఈ వంతెన నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. గతంలో పనులు ప్రారంభించినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ లోపాల కారణంగా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. దీంతో మరో కాంట్రాక్టర్ కు పనులు అప్పగించి తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ వంతెన పూర్తయితే ప్రస్తుతం ప్రయాణించాల్సిన దూరం, సమయం గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గ సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకువస్తున్నామని తెలిపారు. వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande