సాగునీటి పనుల జాప్యాన్ని సహించేది లేదు.. మంత్రి ఉత్తమ్ కుమార్
సుమారు 9,500 ఎకరాలకు సాగునీరు అందించే రెండు ఎత్తిపోతల పథకాల పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గడువు విధించారు
Minister


హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.)

సుమారు 9,500 ఎకరాలకు సాగునీరు అందించే రెండు ఎత్తిపోతల పథకాల పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గడువు విధించారు. కోదాడ మండలంలోని రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పనులు ఆశించిన వేగంతో సాగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. రెడ్లకుంట పథకాన్ని డిసెంబర్ చివరి నాటికి, శాంతినగర్ రాజీవ్ ఎత్తిపోతల పథకాన్ని వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే సంబంధిత కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి, యాసంగి సీజన్ లో వరి సాగుకు దూరంగా ఉండి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande